APPSC Chairman : ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా

Update: 2024-07-04 05:29 GMT

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ( Gautam Sawang ) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ అయ్యారు. పదవీ విరమణకు రెండేళ్ల ముందే సవాంగ్ రాజీనామా చేశారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఠాకూర్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించి సవాంగ్‌కు బాధ్యతలు అప్పగించారు. దాదాపు మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. సవాంగ్‌ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని భావించిన జగన్ సర్కారు ఆయన్ని పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామాలపై సవాంగ్ మనస్తాపాని గురయ్యారని ప్రచారం జరగడంతో ఆయనతో రాజీనామా చేయించి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు.

డీజీపీగా కొనసాగిన సమయంలో సవాంగ్ వైసీపీ అనుకూల ముద్ర వేసుకున్నారు. అంతకు ముందు విజయవాడ సీపీగా కొనసాగిన సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. డీజీపీ పదవి వచ్చిన తర్వాత చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడి చేయడం, టీడీపీ నాయకులపై దాడులను ఊపేక్షించారనే విమర్శలు ఉన్నాయి.

Tags:    

Similar News