APSRTC: ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆర్టీసీ
కావలిలో డ్రైవర్‌పై దాడిపట్ల తీవ్ర ఆగ్రహం.... ప్రభుత్వంపై స్పందిచకపోవడంపై మండిపాటు...;
నెల్లూరు జిల్లా కావలిలో A.P.S. R.T.C డ్రైవర్‌పై మూకుమ్మడి దాడి పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. దాడి కారకుల్ని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. డ్రైవర్‌పై దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్నిడిపోల్లో నిరసనలకు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ డ్రైవర్‌పై నెల్లూరు జిల్లా కావలిలో దాడి జరిగి రెండ్రోజులువుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హారన్ కొట్టినందుకే దాడి చేస్తే.. ఇక ఉద్యోగులకు భద్రత ఎక్కడుందని ఆక్రోశిస్తున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో RTC ఉద్యోలు నిరసనలు తెలపాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. 129 డిపోల్లోనూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై ధర్నా చేయాలని NMU, SWF, EU నేతలు పిలుపునిచ్చారు.
ప్రజలకు రవాణా సేవ చేస్తున్న సిబ్బందిపై దాడులు సరికాదని APజేఏసీ అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆక్షేపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం చొరవ తీసుకుని నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయాలన్నారు. డ్రైవర్ B.R. సింగ్‌పై దాడిని తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం ఖండించాయి. హారన్ కొట్టడం కూడా నేరమని చట్టం చేస్తారేమో అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సందేహం వెలిబుచ్చారు. నడిరోడ్డుపై వైసీపీ నేతలు గూండాల కన్నా ఘోరంగా దాడి చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుపట్టారు.ఏపీ ఫ్యాక్షన్ ప్రదేశ్ గా మారిపోయిందని..... జగన్ పోతేనే రాష్ట్రంలో ఉన్న సైకో గ్యాంగులన్నీ పోతాయని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కావలిలో విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి.రామ్‌సింగ్‌పై మూకుమ్మడిగా దాడి చేసిన వారిలో ఆరుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన 24గంటల్లోనే నిందితులు శివారెడ్డి, విల్సన్, మహేశ్, రాజీ, మల్లి, ఇలియాజ్‌ను అరెస్టు చేశామన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నామని, ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌తో పాటు దాడి చేసిన మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అరెస్టు చేసిన నిందితులను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. కావలిలో మూకుమ్మడి దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్ కు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ బి.రామ్‌సింగ్‌పై జరిగిన దాడి ఘటనపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌రెడ్డి స్పందించారు. ‘‘డ్రైవర్‌పై దాడి చేసిన వారంతా నరరూప రాక్షసులు. చోరీలు, దొంగ రవాణా, భూదందా, హత్యలు చేసేవాళ్లు. ఆ దుర్మార్గుల గురించి కావలిలో ఎవరిని అడిగినా చెబుతారు. కొందరు పోలీసులు ఈ నేరగాళ్లకు కొమ్ముకాస్తున్నారు. నేరగాళ్లతో కుమ్మక్కై కావలిలో శాంతిభద్రతలు గాలికి వదిలేస్తున్నారు. నేరగాళ్లకు అండగా నిలిచే పోలీసులపై అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని కావలి ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.