ప్రభుత్వం నాపై ప్రత్యేక దృష్టి పెట్టింది వ్యక్తిగతంగా నష్టం చేయడానికా..? అశోక్‌గజపతిరాజు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.;
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం జిల్లా నెల్లమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం బోడికొండ ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో.. అశోక్ గజపతిరాజు సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న బోడికొండపై రామాలయ పునర్నిర్మాణం కోసం భూమిపూజ కార్యక్రమం జరిగింది.. అయితే, సంప్రదాయాలు పాటించలేదని అడిగినందుకు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజును నెట్టేశారు స్థానిక వైసీపీ నేతలు.
ఇది తమ పూర్వీకులు నిర్మించిన ఆలయం అని చెప్పినా అధికారులెవరూ పట్టించుకోలేదు.. దీనిపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక ఉద్రిక్తతల మధ్యే భూమిపూజ కార్యక్రమం జరిగింది.. అయితే, ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించేలా వ్యవహరించారంటూ ఇవాళ అశోక్ గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు.. విధులకు ఆటంకం కలిగించారని... వస్తువులను డ్యామేజ్ చేశారని ఈవో ప్రసాద్ కంప్లైంట్ చేయడంతో ఆయనపై 473, 353 సెక్షన్ల కింద నెల్లిమర్ల పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఇక రామతీర్థంలోని బోడికొండ కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని కావాలనే వివాదాస్పదం చేసినట్టు కనిపిస్తోందని అశోక్ గజపతిరాజు అన్నారు. భూమిపూజకు ముహూర్తం పెట్టి ఛైర్మన్‌కు చెప్పరా అని నిలదీశారు. తన అభ్యంతరాల్ని పట్టించుకోకుండా మొండిగా వ్యవహరించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని.. ఇది వ్యక్తిగతంగా నష్టం చేయడానికా..? లేదంటే మాన్సాస్ ట్రస్ట్‌ను దెబ్బ తీయడానికా..? అని ప్రశ్నించారు.