ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి ( Ayyanna Patrudu ) పేరు ఖరారైందా..? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఎన్డీయే సర్కారు నిర్ణయించింది. ఎవరికి ఇవ్వాలన్నదానిపై టీడీపీ, జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక నేడు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి, తిరిగి సా.4 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిదే తొలి పర్యటన.