చంద్రబాబు అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే.. జగన్ జైల్లో ఉన్న రౌడీలను, పరామర్శించడానికి పరిగెడుతున్నాడని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. తన కారు కింద పడి చనిపోయిన మనిషిని పట్టించుకోని జగన్..రాజకీయ నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. సుపరిపాలన అందించాలని ప్రభుత్వం పనిచేస్తుంటే ... విధ్వంసాలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారని.. కానీ అది జరగని పని అన్నారు. పాదయాత్రే కాదు... ఏ యాత్ర చేసినా అధికారంలోకి రాడన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని మంత్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. పించన్ల పెంపు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలే దానికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతోషంగా ఉన్నారని.. గ్రామాల్లోకి వెళ్తే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.