గోదావరి జిల్లాల్లోని కానూరు, వేల్పూరులో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటంతో అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ తేలిన 2 ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు. దీంతో మిగతా ప్రాంతాలవారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు. అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినొచ్చని, సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
వివిధ దేశాల నుంచి వచ్చే వలస పక్షుల్లో ఉండే వైరస్.. వాటి రెట్టల ద్వారా జలాశయాల్లోకి చేరుతోంది. అక్కడ నుంచి నీరు, ఇతర మార్గాల్లో కోళ్లకు సంక్రమిస్తోంది. నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో కొన్నిచోట్ల వైరస్ ప్రభావం చూపింది. అక్కడ చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా.. బయటపడేయడంతోనే కోళ్లఫారాలకు చేరింది. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదని. ప్రస్తుతం రాష్ట్రంలోని అధికశాతం ప్రాంతాల్లో 34 డిగ్రీల పైనే నమోదవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.