ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని... దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని, రూ.3కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ ఎరువులపై విష ప్రచారం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. సకాలంలో యూరియా, ఎరువులు సరఫరా చేయడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యూరియాకు సంబంధించి ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. "ఏపీలో నేర్థులు ఎక్కువయ్యారు. కృష్ణా జిల్లాలో యూరియా లారీని వైకాపా నేత అడ్డుకొని వివాదం చేశాడు. రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తారని ఎవరు చెప్పారు?ప్లాంట్ సమర్థతను పెంచడానికి కొన్ని సర్వీసులను ఔట్సోర్సింగ్ చేస్తారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.12వేల కోట్లు నిధులు వచ్చాయి. ఔట్సోర్సింగ్ నెపంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.” అని చంద్రబాబు అన్నారు.
టీడీపీ ఫోరమ్'కు లోకేశ్ అభినందనలు
'బెంగళూరు టీడీపీ ఫోరమ్' నేడు 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారికి మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మాతృభూమి అభ్యున్నతి కోసం, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటం కోసం నిరంతరం చేస్తున్న కృషి చేస్తున్న 'బెంగళూరు టీడీపీ ఫోరమ్' సేవలు అభినందనీయమన్నారు. స్వరాష్ట్రం స్వర్ణాంధ్రగా విరాజిల్లాలనే వారి కలలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు. టీడీపీ బలోపేతంలో వీరి కృషి ఎంతో ఉందన్నారు.
టీటీడీ ఆస్పత్రుల్లో సేవ చేసేందుకు అవకాశం
తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలుస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు మరింత రుచికరమైన ఆహారం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో క్యాంటీన్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని గుర్తు చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఆస్పత్రుల్లో సేవ చేయాలనుకునే భక్తులకు ‘శ్రీవారి సేవ ట్రైనర్’ పేరుతో మూడ్రోజులపాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సేవ చేయడానికి వచ్చే భక్తులకు కనీసం డిగ్రీ విద్యార్హత ఉండాలని చెప్పారు. సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లోనూ వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. విదేశాల నుంచి చాలా మంది భక్తులు శ్రీవారి సేవకు ముందుకొస్తున్నారని, ఎన్ఆర్ఐ భక్తుల సేవలు కూడా వినియోగించుకుంటామని తెలిపారు.