CBN: చెత్తనే కాదు... చెత్త రాజకీయాలను తొలగిస్తాం
మాచర్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు... స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న సీఎం... చీపురు పట్టి శుభ్రం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో చెత్త రాజకీయాలను కడిగేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చిరించారు. మాచర్లలో సర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మాచర్లలో చాలాకాలం ప్రజాస్వామ్యం లేకుండాపోయిందని అన్నారు. కొందరు నేతలు రౌడీయిజంతో విధ్వంసం చేశారని కామెంట్ చేశారు. నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగాయని.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పల్నాడు వైసీపీ నేతలను ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చ రించారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదామని పిలుపునిచ్చారు. చెత్త పన్ను తొలగించడం తోపాటు చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తామని తెలిపారు. పల్నాడులో రౌడీయిజాన్ని అణచివేస్తానని చెప్పుకొచ్చారు. చెత్తనే కాదు.. చెత్త రాజకీయాలను కూడా తొలగిస్తానని తెలిపారు.
ఫ్యాక్షనిజం లేకుండా చేశాం
తాము అధికారంలోకి రాగానే రాయసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానని అన్నారు. ఇక నుంచి పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను 2014 నాటి సీఎంను కాదని.. 1995 నాటి సీఎంను అంటూ హెచ్చరించారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసిందని.. చెత్తను కూడా తొలగించలేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తూనే చెత్త మీద పన్ను తొలగించామని.. చెత్తను లేకుండా చేశామని తెలిపారు. చెత్తను మాత్రమే కాదు.. రాబోయే రోజుల్లో చెత్త రాజకీయాలను కూడా కడిగేస్తానని సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు.
మరో రెండు నదుల అనుసంధానం
శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తామని చంద్రబాబు తెలిపారు. పల్నాడు జిల్లాలో తలసరి ఆదాయం తక్కువ ఉందని, అన్ని ప్రాంతాలతో సమానంగా మాచర్ల, గురజాలను అభివృద్ధి చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మూడేళ్లలో ఇంటింటికీ కుళాయితో తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పలనాడు జీవనాడి వరికెపుడిశెల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. 1.25 లక్ష ఎకరాలకు నీరు అందుతుంది. మరో లక్ష మందికి తాగునీరు అందిస్తామని చెప్పారు. మొదటి దశలో 1.45 టీఎంసీలు, రెండో దశలో 6.3 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి వరం పోలవరం. గతంలో మేం 76 శాతం పూర్తి చేస్తే ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి విధ్వంసం చేశాడని చెప్పారు. ప్రజావేదికతో విధ్వంసం మొదలు పెట్టి పోలవరంలో డయాఫ్రాం వాల్ కొట్టుకుపోయేలా చేశాడని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం పునర్నిర్మాణం చేపట్టామని, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు.
చీపురు పచ్చిన చంద్రబాబు
పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్తను ఊడ్చారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గదర్శి- బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం అయ్యారు.
పన్నుల భారం తగ్గింది
జీఎస్టీ సంస్కరణల వల్ల పన్నుల భారం తగ్గిందని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని సీఎం అన్నారు. ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సప్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. సంజీవని ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పథకం కింద ధనిక, పేద తేడా లేకుండా అందరికీ రూ.2.5 లక్షల బీమా కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.