CBN: జనమే ఆస్తి...జనాభానే పెట్టుబడి: చంద్రబాబు
ముగ్గురి కంటే ఎక్కువమందిని కనాలి... పాలసీలు మార్చాల్సిందేనంటూ వ్యాఖ్యలు.. జనాభా దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు;
"జనాభా భారం కాదు.. జనమే ఆస్తి.. అదే అతి పెద్ద పెట్టుబడి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సచివాలయం దగ్గర నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... జనాభాపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని చంద్రబాబు అన్నారు. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతోందని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. " దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అని గురజాడ అప్పారావు చెప్పారు. దేశమంటే మనుషులు.. కష్టాలు.. సమస్యలు.. పరిష్కారం అన్నీ ఉంటాయి.. గురజాడ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి.. ఇద్దరు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని నేనే చట్టం తీసుకొచ్చా.. కానీ, ఒక్కోసారి పాలసీలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు జనాభా భారం కాదు.. జనమే ఆస్తి అన్నారు చంద్రబాబు.
జనాభా వల్ల అన్నీ లాభాలే..
" జనాభా తక్కువుంటే అవసరాల నిమిత్తం ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తారు.. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాలు ఉంటాయి.. జనాభా పెరిగితే పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, అవకాశాలు ఉంటాయి" అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తానెప్పుడూ మహిళా పక్షపాతినని.. ఆస్తిలో మహిళలకి సమానహక్కు కలిపించి ఎన్టీఆర్ మహిళల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. జనాభా నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.. త్వరలో జనాభా నిర్వహణపై డ్రాఫ్ట్ పాలసీ తీసుకొస్తామని వెల్లడించారు.అయితే, మితి మీరిన నియంత్రణ చర్యలు వల్ల చాలా నష్టపోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం అని చెప్పి 15 వేలు ఇస్తున్నాం అన్నారు.. జనాభా పెరుగుదల కోసం అందరు కృషి చేయాలని.... చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్ట పోయిందని.. జనాభా పెరుగుదల కోసం మాట్లాడాలని సూచించారు.
20 శాతం మంది పెళ్లిళ్లే వద్దంటున్నారు
దేశంలో 20 శాతం మంది పెళ్లి వద్దనుకుంటున్నారనే సర్వేలో వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం, ఉద్యోగం లేకపోవడం వలనే చాలామంది పిల్లలు వద్దనుకుంటున్నారన్న ఆయన.. ఈ పరిస్థితులను అధిగమించి.. జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. దక్షిణ భారత దేశంలో నియోజక వర్గాల సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయని చంద్రబాబు తెలిపారు. దానికి కారణం జనాభా నియంత్రణ చర్యలేనని వెల్లడించారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే పథకాలు అమలు చేయాలన్నారు. " ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నాం.. కానీ ఇప్పుడు జనాభా నిర్వహణ అంటున్నాం.. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలి.. దాని కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి.. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే విధంగా పథకాలు తీసుకువస్తాం.. పాపులేషనే మనకు ఒక పెద్ద ఆస్తి.. జనాభా నే మనకు అతి పెద్ద పెట్టుబడి.. ఇప్పుడు చాలా దేశాల్లో వయసు మళ్లిన వారే అధికంగా ఉన్నారు.. ఇప్పటి నుంచి భావి తరాల భవిష్యత్ కోసం జనాభా నిర్వహణ కోసం అందరు సహకరించాలి.. మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పని చేశాం.. పాపులేషన్ మ్యానేజ్మెంట్ కోసం పని చేయాల" అని పిలుపునిచ్చారు.
పాలసీలు మారాల్సిందే..
పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు మార్చుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని చంద్రబాబు అన్నారు. మంచి పాలసీ ఏవిధంగా తేవాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరిన సందర్భంగా 1985 జులై 11న మొదటిసారి ఐరాస ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించింది. గతంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవాళ్లు. ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు వచ్చాయి. ప్రత్యుత్పత్తి రేటు 2.1గా ఉంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రత్యుత్పత్తి రేటు 1.8గా ఉంది.. ఇది మెరుగుపడాలి’’ అని సీఎం అన్నారు. గతంలో ఇద్దరు పిల్లల కంటే.. ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదనే చట్టం తెచ్చానని గుర్తుచేశారు.