CBN: టీడీపీ ఎమ్మెల్యేలకు టైమ్‌టేబుల్..!
సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం... ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై సీఎం ఫోకస్.. ఇప్పటికే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీస్
ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి చర్చనీయాంశమైన నేపథ్యంలో చంద్రబాబు పాలనతో పాటుగా పార్టీపైనా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సుమారుగా 16 నెలలు దాటిపోయింది. అయితే ఇన్ని రోజులైనా కొంతమంది ఎమ్మెల్యేలు తీరు మార్చుకోలేదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజల్లో ఉండాలంటూ తాను చేసిన సూచనలు పాటించడం లేదని భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొనడం లేదని చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా కొంతమంది ఎమ్మెల్యేలు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. విపక్షం చేసే దుష్ప్రచారం తిప్పికొట్టాలని ఎప్పటికప్పుడు మార్గ నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు టీడీపీ అధిష్టానం కొత్తగా టైమ్ టేబుల్ రూపొందించినట్లు సమాచారం.
కీలక సూచనలతో...
ఈ టైమ్ టేబుల్ ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీ క్రమం తప్పుకుండా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలి.అలాగే ప్రతి నెలా 5వ తేదీన తమ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యేలు సందర్శించారు. ఆ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులను పరిశీలించాలి. అలాగే ప్రతి నెలా10వ తేదీన తమ నియోజకవర్గం పరిధిలోని అన్న క్యాంటిన్లో ఎమ్మెల్యేలు భోజనం చేయాల్సి ఉంటుంది. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న భోజనం ఎలా ఉందనేది తెలుసుకోవటంతో పాటుగా ప్రజలకు వివరించాలి. వీటితో పాటుగా ప్రతి నెలా 15వ తేదీన తమ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు తనిఖీ చేయాలి. ఆస్పత్రిలోని రోగుల సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకోవాలి. డాక్టర్లు, వైద్య సిబ్బంది సమస్యలపైనా దృష్టి పెట్టాలి. అలాగే 20వ తేదీన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, టీడీపీ కార్యకర్తల బీమాకు సంబంధించిన చెక్కులను పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.