YS Vivekananda Reddy: సీబీఐ దర్యాప్తు మొదలయ్యాక వివేకా హత్య కేసు తప్పుదోవ..

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి.

Update: 2022-02-22 13:53 GMT

YS Vivekananda Reddy: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు మొదలయ్యాక కూడా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి.. అప్రూవర్‌గా మారాక సీబీఐకి ఇచ్చిన మొదటి స్టేట్మెంట్‌ ఇవాళ బయటికొచ్చింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించాడు దస్తగిరి. అప్రూవర్ స్టేట్మెంట్ తర్వాత భరత్ రెడ్డి తనను కలిశాడని స్టేట్మెంట్‌లో పేర్కొన్నాడు.

భరత్ యాదవ్‌తో పాటు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి లాయర్ ఓబుల్ రెడ్డి తనవద్దకు వచ్చారన్నాడు. తమను భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి పంపించారని చెప్పారన్నారు. 10నుంచి 20 ఎకరాల భూమిస్తాం, ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని వారు అడిగారని స్టేట్మెంట్‌లో తెలిపాడు నిందితుడు దస్తగిరి. గతేడాది సెప్టెంబర్ 30న తనను కలిసిన వారిపై సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లోని విషయాలే తాజాగా వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు వైఎస్ వివేక హత్య కేసు బదిలీ అయింది. ఇకనుంచి కడప జిల్లా కోర్టులోనే నిందితుల విచారణ జరగనుంది. అంతకుముందు కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి పులివెందుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్య కారణాలతో శివశంకర్‌రెడ్డి కోర్టుకు రాలేదు. ప్రస్తుతం అతనికి కడప రిమ్స్‌లో చికిత్స జరుగుతోంది.

Tags:    

Similar News