Chandrababu Deeksha : వైసీపీ దాడులకు వ్యతిరేకిస్తూ... 36 గంటల నిరసన దీక్ష చేయనున్న చంద్రబాబు..!
Chandrababu Deeksha : టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడితో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు..;
chandrababu naidu (File Photo)
Chandrababu Deeksha : టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడితో ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. దాడికి నిరసనగా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు" పేరుతో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రేపు సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. మంగళవారం జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.
మరోవైపు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు చంద్రబాబు. 36 గంటల నిరసన దీక్ష అనంతరం శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించనున్నారు. వైసీపీ కార్యకర్తల దాడుల అనంతరం అమిత్ షాకు ఫోన్ చేశారు చంద్రబాబు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేస్తున్నారని.. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలంటూ కోరారు. పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించగా.. దాడి విషయం ఇంకా తన దృష్టికి రాలేదని పార్టీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు అమిత్ షా. దీంతో చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు.
చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారైంది. 36 గంటల దీక్ష అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి షాను చంద్రబాబు కలిసి వివరించనున్నారు. టీడీపీ ఆఫీసులపై దాడులు గిరించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతోపాటు పరిస్థితుల గురించి వివరించనున్నారు. ఆయనతోపాటు పలువురు నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.మొత్తానికి... ఏపీ జరుగుతున్న వైసీపీ దాడుల ఎపిసోడ్ హస్తినకు చేరుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఆసక్తిగా మారింది.