AP: మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై నేడు చంద్రబాబు కీలక సమీక్ష

డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని నివేదిక సిద్ధం చేసిన అధికారులు... అదనంగా బస్సులు కూడా కొనాలని నివేదిక;

Update: 2024-08-21 02:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. ఉచిత బస్సు ప్రయాణంపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఈ నివేదికలో కీలక సూచనలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికి అనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అన్నీ సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని, లేకపోతే చాలీచాలని బస్సులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయనం వివరాలు తెలియజేయనున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీలో 10 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220. మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సుల కొనగా.. వీటిలో ప్రతినెలా కొన్ని చొప్పున బస్సులు బాడీబిల్డింగ్‌ పూర్తిచేసుకొని డిపోలకు చేరుతున్నాయి. అయితే జగన్‌ ప్రభుత్వంలో కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. ఇప్పుడు తీసుకుంటున్న కొత్త బస్సులన్నీ వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నవే. ఈ నేపథ్యంలో కొత్త బస్సులు కొనాలని అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే.. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా కనీసం 2 వేల కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలాకాలంగా ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు లేవు. పదవీ విరమణల కారణంగా డ్రైవర్ల కొరత మరింత పెరుగుతోంది. 3,500 మంది వరకు డ్రైవర్‌ పోస్టులు భర్తీచేయాలని అధికారులు నివేదిక రూపొందించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు రూ. 250-260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతినెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతినెలా వచ్చే రాబడిలో 25 శాతం ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఈ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన రూ.125-135 కోట్లు అదనంగా ప్రభుత్వమే, ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గాడితప్పిన రవాణాశాఖపై కూడా సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా ఉన్న నలుగురు జోనల్‌ సంయుక్త రవాణా కమిషనర్లను కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు. కమిషనరేట్‌లో ఉండే పనుల్లో వీరిని భాగస్వామ్యులు చేశారు. వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ల జారీ సమయంలో అధికారులు చేతివాటం చూపకుండా, ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. తమ దందా పోతుందని కొందరు అధికారులు వాటిని వ్యతిరేకిస్తున్నారు.

Tags:    

Similar News