ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన బలవంతపు ఆస్తుల రాయింపు, వ్యాపారాల్లో వాటాల లాక్కోవడం వంటి ఘటనలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అధికారం అండతో గన్ను పెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకోవడం, వ్యాపారాల్లో వాటాలు తీసుకోవడం లాంటి ఘటనలు దేశ చరిత్రలో ఎక్కడా లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి గురించి విన్నప్పటికీ ఇలాంటి దారుణాలు చూసింది ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాలు సమాజాన్ని కలవరపెడుతున్నాయనీ ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. ముంబైలో మాఫియా ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉన్నట్లు తెలుసుకున్నామని అలాంటి చట్టాలను మన రాష్ట్రంలో అమలు చేసే అవకాశం పరిశీలిస్తామని తెలిపారు.
ఆస్తులు పోగొట్టుకున్నవారికి న్యాయం చేయడం తమ బాధ్యతని అన్నారు కాకినాడ పోర్టు, సెజ్‌లలో బలవంతపు వాటాల లాక్కోవడం లాంటి ఘటనలు ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తాయేమో అనేది చట్టపరంగా విశ్లేషించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భూముల వివాదాల గురించి ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని కొందరు అధికారులు ప్రజల సమస్యల్ని తేలికగా తీసుకుంటూ నిర్లక్ష్యం చూపిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలకు తగిన పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
కుటుంబ వివాదాలు కొన్ని సమస్యలుగా వెలుగుచూస్తున్నప్పటికీ వాటిలో అన్యాయంగా నష్టపోయినవారికి సహాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
2019 తర్వాత జరిగిన న్యాయబద్ధమైన అమ్మకాలు, కొనుగోళ్లను తప్పు పట్టలేమని, కానీ రికార్డులను మార్చి అక్రమాలు చేసినట్లయితే వాటిపై చర్యలు తీసుకోవడం అనివార్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ నెలలో జరగబోయే రెవెన్యూ సదస్సుల అనంతరం భూముల సమస్యల పరిష్కారంలో మరింత స్పష్టత రానుందని అన్నారు. ప్రజల దగ్గర నుంచి ఊరికే కాగితాలు తీసుకోకుండా సమస్యల్ని సరైన మార్గంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వడం తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.