AP : మాటకు కట్టుబడే తత్వం..జన సైన్యానికి ధైర్యం.. పవన్‌కు చంద్రబాబు, లోకేశ్ బర్త్ డే విషెస్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌లు ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వారు తమ ‘ఎక్స్’ ఖాతాల ద్వారా పవన్ కల్యాణ్‌పై తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ.. "పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువునా సామాజిక స్పృహ. ఆయన మాటల్లో పదును, చేతల్లో చేవ కనిపిస్తుంది. మాటకు కట్టుబడే తత్వం, జన సైన్యానికి ధైర్యం, రాజకీయాల్లో విలువలకు పట్టం కట్టడం - ఇవన్నీ కలిస్తే పవనిజం" అని అన్నారు. పవన్ కల్యాణ్ ప్రజల దీవెనలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని, మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర పాలనలో, అభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిదని చంద్రబాబు కొనియాడారు.
వెండితెరపై పవర్ స్టార్‌గా అభిమానులను అలరించిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి పీపుల్ స్టార్ గా ఎదిగారని నారా లోకేశ్ ప్రశంసించారు. ప్రజల కోసం తగ్గడం, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నిలబడడం ఆయన గొప్ప లక్షణాలని లోకేశ్ పేర్కొన్నారు. "సొంత తమ్ముడి కంటే ఎక్కువగా పవన్ నన్ను అభిమానిస్తారని" తెలిపారు. అండగా నిలుస్తున్న పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని లోకేశ్ పేర్కొంటూ.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.