డిప్యూటీ సీఎం, మంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తన నియోజకవర్గం పిఠాపురంలో స్థలం కొన్నారు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణానికి 3.52 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రెండు ఎకరాల్లో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకొని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉండనున్నారు. కాగా ఈ ప్రాంతంలో ఎకరం రూ.15-16లక్షలు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో పదెకరాల తోటలు జనసేన నేతలు కొనేందుకు సిద్ధమవుతున్నారట.
డిప్యూటీ సీఎం పదవిని తాను కోరుకోలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం వారాహి సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు నన్ను అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో చూస్తాం అన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్లేలా చేశారు. పిఠాపురం విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అని ఆయన వ్యాఖ్యానించారు.
వాలంటీర్లు లేకపోతే పథకాలు రావంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారని పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ ఒక్క వాలంటీర్ సహాయం లేకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించి దాదాపు ఒక్కరోజులో పింఛన్లు పూర్తి చేశామని వివరించారు. దీనికి ఎంతో అనుభవం కావాలని, అందుకే అపార అనుభవం ఉన్న చంద్రబాబుతో కూటమి ఏర్పాటు చేశామని పవన్ వెల్లడించారు.