వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ప్రైవేటు దుకాణాల్లో నిర్ణీత ధర కంటే అధిక ధరలకు యూరియా ను విక్రయిస్తుండడంతో రైతులు వ్యవసాయ కేంద్రాల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మదనపల్లె లో ఓ ఎరువుల దుకాణం లో ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాను నిర్ణీత ధరకే విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో మదనపల్లె నియోజకవర్గం లోని పొన్నిటి పాలెం, కోళ్లబైలు, చీకలబైలు పంచాయతీ ల నుంచి అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చారు. దీంతో షాపు యాజమాన్యం స్టాకు ఉన్నంత మేరలో రైతులకు యూరియాను విక్రయించారు. గంటల వ్యవధిలోనే సరుకు అయిపోవడంతో యాజమాన్యం చేతలెత్తేశారు. ఈ మేరకు రైతులు షాపు వద్ద అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను అందించడంలో పూర్తి వైఫల్యం చెందిందని వాపోయారు. సరైన సమయంలో రైతులకు యూరియాను అందించక ఒక రైతుకు ఒక ప్యాకెట్ మాత్రమే ఇవ్వడంతో రైతులు షాపుల వద్ద వ్యవసాయ కేంద్రం వద్ద ఆందోళన చెందుతున్నారు. రైతులు దాడులకు దిగి కోట్లాటలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం రైతులకు సరిపడా యూరియాను అందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళనకి దిగుతామని హెచ్చరించారు..