Andhra Pradesh : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుకు కీలక పదవి..

Update: 2025-08-19 09:30 GMT

టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవి లభించింది. ఆయనను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు ఆయనకు సహాయ మంత్రి హోదా కూడా కల్పించారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జీఏడీ, ప్రోటోకాల్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పార్టీలో సుదీర్ఘ అనుభవం

దాదాపు రెండు దశాబ్దాలకుపైగా టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న మంతెన సత్యనారాయణ రాజు, పార్టీ కోసం ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. 2017 నుంచి 2023 వరకు ఆయన శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. తెలుగు యువత కార్యదర్శిగా , ఆ తర్వాత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. గతంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన మీ కోసం పాదయాత్రలో వాలంటీర్ల సమన్వయకర్తగా రాజు పని చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, పార్టీ గళాన్ని వినిపించడంలోనూ శాసనమండలిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవడంలోనూ, నారా లోకేశ్‌పై దాడి జరగకుండా అడ్డుకోవడంలోనూ ఆయన తన వంతు సహకారం అందించారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా వ్యవహరించిన రాజు.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా కీలక పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు సభల నిర్వహణ బాధ్యతలను కూడా ఆయనే చూసుకున్నారు. పార్టీకి అత్యంత విధేయుడుగా ఉన్నందుననే చంద్రబాబు ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News