గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత పురంశెట్టి అంకులు హత్యపై తీవ్ర దుమారం
టీడీపీ నేత హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు;
గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు హత్యపై తీవ్రదుమారం చెలరేగుతోంది. పట్టణంలోని హైవే పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ మొదటి ఫ్లోర్‌లో నిన్నరాత్రి అంకులు దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి, మెడకోసి కిరాతకంగా హత్యచేశారు. వైసీపీ నేతలు అంకులును హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి పోలీసుల సహకారం కూడా ఉందంటూ అంటున్నారు. అంకులు హత్యకు వైసీపీ నేతలే కారణమంటున్నారు టీడీపీ నేతలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం అంకులు మృతదేహం గురజాల మార్చురీలో ఉంది. అక్కడే పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి దాచేపల్లికి భారీ ర్యాలీ మధ్య అంకులు మృతదేహాన్ని టీడీపీ శ్రేణులు తీసుకునిరానున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మాజీ హోం మంత్రి చినరాజప్ప.. అంకులు మృతదేహానికి నివాళులు అర్పిస్తారు.
హత్య తర్వాత మృతుడి ఫోన్‌ను దుండగులు తీసుకెళ్లారు. అంకులు ఫోన్ కాల్ డేటాను.. పోలీసులు సేకరిస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చిన తర్వాతే అంకులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఫోన్ మాయమవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆదేశాలతో పోలీసులే ఫోన్ మాయం చేశారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ నేత హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .టీడీపీ నేతలను హత్య చేయించి సీఎం జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేకుండా పోయిందని లోకేష్ ధ్వజమెత్తారు. అంకులు మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు కుడిభుజంగానూ, గ్రామంలో టీడీపీకి బలమైన నాయకుడిగానూ ఉన్నారు. 20 ఏళ్లపాటు పాటు సర్పంచ్‌గానూ, ఎంపీటీసీగా పనిచేశారు. గతంలో కూడా అంకులుపై పలుమార్లు హత్యాప్రయత్నాలు జరిగినప్పటికీ తప్పించుకున్నారు.