ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం వుంది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రెండురోజుల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళుతుందని భావిస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.
మరోవైపు రేపు ఎల్లుండి ఉత్తర కోస్తా లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని.. అలాగే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సెప్టెంబరులో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.