Heavy Rains : భారీ వర్షాలు.. వినాయక మండపాల నిర్వాహకులకు ఏపీ విపత్తుశాఖ హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలను, ముఖ్యంగా వినాయక చవితి మండపాల నిర్వాహకులను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పండుగ సంబరాలకు వర్షం అడ్డుగా మారే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మండపాలకు విద్యుత్ సరఫరా చేసే వైర్లను సురక్షితంగా ఏర్పాటు చేయాలని.. వర్షం నీరు నిలిచే చోట వైర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచించారు అధికారులు. మండపం చుట్టూ నీరు చేరకుండా ప్లాట్‌ఫారమ్‌లను ఎత్తులో నిర్మించాలని సూచించింది. వర్షం తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు, భక్తులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.
ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని APSOMA తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ, రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.