Raghuramakrishna Raju : అలా చేస్తే జగన్ సభ్యత్వం రద్దు - రఘురామకృష్ణరాజు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించడంపై అధికార కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే ఇచ్చే చాక్లెట్ కాదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేయగా వరుసగా 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.
రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు:
గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు శాసనసభ నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాని సభ్యుడు అనర్హుడు అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఇదే నిబంధన అసెంబ్లీ నిబంధనావళిలోని క్లాజ్ 187(2)లో కూడా ఉందని తెలిపారు. వైసీపీ నేతలు ఈ నిబంధనలను పరిశీలించాలని సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులకు ప్రశ్నలు కేటాయించినప్పటికీ వారు సభలో ఉండటం లేదని ఆయన విమర్శించారు.
వంగలపూడి అనిత స్పందన:
"ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్టో, బిస్కెట్టో కాదు.. అడిగినంత మాత్రాన ఇవ్వడానికి. అది ప్రజలు ఇవ్వాలి" అని వ్యాఖ్యానించారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారని ఆమె అన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్కరే బయటకు వెళ్లినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా సభలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ హోదాలోనే సభలో మాట్లాడాలని ఆమె సూచించారు.