ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టొద్దంటూ జగన్ సర్కార్ ఆదేశాలు
AP Government: జగన్ ప్రభుత్వ బ్లాంక్ జీవోలను బయటపెట్టిన టీడీపీ;
ప్రభుత్వ జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం జారీ చేసిన బ్లాంక్ జీవోల గుట్టును బయటపెట్టింది టీడీపీ. అక్కడితో ఆగకుండా నేరుగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గవర్నర్ కార్యాలయం దర్యాప్తు చేయించాలని కూడా చెప్పారు. 89 జీవోలు జారీ చేస్తే అందులో 49 బ్లాంక్ జీవోలు ఉన్నాయంటూ గవర్నర్‌కు చెప్పడంతో.. ఆయన కూడా ఆశ్చర్యపోయారని టీడీపీ తెలిపింది. తమదంతా పారదర్శక పాలన అని చెబుతున్న జగన్.. ఎందుకు రహస్య జీవోలు, బ్లాంక్ జీవోలు జారీ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని నిలదీసింది. ఈ పరిణామాలతో జగన్ ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులను చవిచూడాల్సి వచ్చింది. దీంతో అసలు జీవోలను ఆన్‌లైన్‌లోనే ఉంచకూడదంటూ అన్ని శాఖల సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ఆర్థిక అంశాలు, అప్పులు, మూడు రాజధానుల వ్యవహారాలు సున్నితమైన అంశాలుగా మారుతున్నాయి. దీంతో జగన్ సర్కార్ చాలా సార్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. కొన్ని రోజుల క్రితం కూడా ప్రభుత్వ సమాచారం ఉద్దేశపూర్వకంగా బయటకు లీక్ చేశారనే కారణంతో ఆర్థిక శాఖలోని సిబ్బందిపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. తాజాగా ఏపీలోనూ జీవోలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకూడదని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో.. 2008లో వైఎస్ ప్రభుత్వం జీవోలను ఆన్‌లైన్‌లోఉంచుతోంది. జగన్ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి తెరదించింది.