బుడమేరు ముంపునకు గత పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సీఎం చంద్రబాబు ( N.Chandrababu Naidu ) ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజలకు బుడమేరు అక్రమాలే శాపంగా మారాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదన్నారు. బుడమేరును పూర్తిగా దురాక్రమణ, కబ్జాలు చేశారన్నారు. వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్లామని చంద్రబాబు ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు. అలాగే మూడు బోట్లు వదిలిపెడితే కౌంటర్ వెయిట్ను ఢీకొట్టాయని, ఆ సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్ద 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందన్నారు.
వరద ఉప్పెనలా ప్రవహిస్తున్న సమయంలో బోట్లు వదిలారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వరద ప్రాంతాలతో పాటు కృష్ణా ప్రవాహం లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి 10 రోజులు పట్టిందన్నారు. అదే గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది. కాదంటూ వైసీపీ తీరును ఆయన ఈ సందర్భంగా ఎండగట్టారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చిన నిధులను దారి మళ్లించారన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు అలాగే మళ్లించారన్నారు. ధాన్యం ఇచ్చిన రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు చెల్లించలేదని సీఎం చంద్రబాబు గత పాలకుల నిర్లక్ష్యంపై పలు విమర్శలు చేశారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు వారు పూర్తి స్థాయిలో వరద పరిస్థితుల నుంచి కోలుకునే వరకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తామని ఆయన భరోసానిచ్చారు.