ప్రముఖ నటుడు, సినీ దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తికి ఇండస్ట్రీలో ఎంతో గౌరవం ఉంటుంది. సామాజిక సమస్యలపై ఆయన తీసే సినిమాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. కమర్షియల్ సినిమాలకు, వాటి నుంచి వచ్చే డబ్బుకు ఆయన దూరంగా ఉంటారు. ఇప్పటికే ఆయనకు పలు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ముఖ్యంగా ఆయన తన వ్యక్తిత్వంతో ఎందరో మనసులు గెలుచుకున్నారు.
సినిమా స్టార్ అయినప్పటికీ మూర్తి నిరాడంబరంగా ఉంటారు. అందుకే ఆయనను అంతా పీపుల్స్ స్టార్‌గా పిలుచుకుంటారు. ఆయన గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన సంక్షేమ పథకాలు అమోఘమని కీర్తించారు. సంక్షేమ రంగంతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై ఆయన దృష్టి పెట్టారని అన్నారు. అలాంటి ఆర్ నారాయణ మూర్తికి సీఎం జగన్ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను 2019 సెప్టెంబర్ 27న సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి కలిశారు. ఆయన స్వస్థలం ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. తమ ప్రాంతంలో సాగు నీటి సమస్య పరిష్కారం కోసం ఆయన సీఎంతో భేటీ అయ్యారు. నారాయణ మూర్తిని మంత్రి దాడిశెట్టి రాజా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారు. విశాఖ జిల్లాలోని గొలుగొండ పేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని మూర్తి జగన్ ను కోరారు. దీనికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించి రూ.400కు పైగా కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. గతంలో సీఎం జగన్‌ను అపర భగీరథుడంటూ కీర్తించిన మూర్తికి ఇది జగన్ ఇచ్చిన షాక్ అంటున్నారు ఈ స్టోరీ తెలిసిన నెటిజన్లు.