PAWAN: జగన్‌ను శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే

ప్రజలే జగన్‌ తరుముతారన్న పవన్‌... తెనాలిలో ఎన్నికల ప్రచారం

Update: 2024-04-15 01:30 GMT

కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతాలు ఇస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రచారం చేసిన ఆయన ఏపీలో కులగణన మాత్రమే కాదు, ప్రతిభాగణన కూడా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కకులాన్ని నమ్ముకుని.. తాను రాజకీయం చేయట్లేదన్న పవన్‌ రాష్ట్ర ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సీఎం జగన్‌ అధికార గర్వంతో అందరినీ బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. అధికార గర్వం ఉన్న వారిని ప్రజలే వెంటపడి తరుముతారన్న పవన్‌..ఎన్నికల్లో దుష్ట పాలనకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.


అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రైతుల పాస్‌పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై కూడా జగన్‌ బొమ్మలు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆశయం కోసం వచ్చిన నాకు ఓటమి బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసని... రెండు చోట్లా ఓడిపోయినా తట్టుకుని ముందుకెళ్తున్నానని... ప్రజలు మోసం చేశారని తానేమీ వెనక్కి తగ్గలేదని పవన్‌ అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మళ్లీ జనం మధ్యకు వచ్చానని... వకీల్‌ సాబ్‌ చెప్పినట్టు తాను మీ కూలీనని. అధికారం ఇస్తే సంతోషంగా పనిచేస్తానని... ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయట్లేదన్నాడు.

"కౌలు రైతులకు జనసేన చేస్తున్న సాయం చూసి స్పందించిన అన్నయ్య చిరంజీవి రూ.5కోట్లు విరాళం ఇచ్చారు. సాయం చేయాలని రామ్‌చరణ్‌కు కూడా చెప్పారు. కౌలు రైతుల కోసం నేను చేసిన ప్రయత్నం ఆయన్ను కదిలించింది. ప్రజల కోసం బలంగా నిలబడ్డానని నన్ను ప్రశంసించారు. దోపిడీ దౌర్జన్యాలు ఇలాగే కొనసాగిస్తే శ్రీలంక అధ్యక్షుడికి పట్టే గతే జగన్‌కూ పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్‌లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. జగన్‌కు అధికార గర్వం తలకెక్కింది, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారు’’ అని పవన్‌ దుయ్యబట్టారు.

మరోవైపు ప్రజాగళం సభల్లో భాగంగా... పాయకరావుపేట, గాజువాక నియోజకవర్గాల్లో పర్యటించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. గాజువాకలో చంద్రబాబుపై కూడా దుండగులు రాళ్లు విసరగా.. గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ రాళ్లు వేస్తోందని మండిపడ్డారు. తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ దళితద్రోహి అని విమర్శించిన చంద్రబాబు ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు.

Tags:    

Similar News