తిరుపతి జిల్లా రేణిగుంట పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెల్ ఫోన్ పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో బారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో విలువైన బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో యూనిట్‌లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా వెలువడిన దట్టమైన పొగ సమీపంలోని రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వరకు వ్యాపించింది. దీంతో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.