AP : కానిస్టేబుల్‌ను కొట్టిన యువకుడిని పరామర్శించడమేంటి..ఇది సిగ్గుచేటు : మంత్రి కొలుసు పార్థసారథి
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాజకీయ వేడి రేకెత్తించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
అనంతరం మాడుగులలో టీటీడీ కల్యాణ మండపంలో డిసిసిబి బ్యాంకు ద్వారా మంజూరైన గృహనిర్మాణ రుణాలు, ఇన్సూరెన్స్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. దాదాపు 1400 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించారు అని కాదు. ఏ పార్టీకి దక్కని ఘనవిజయం మాకు కల్పించారని అన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి, గత వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆ అప్పులు తెచ్చిన చోటు, ఖర్చుపెట్టిన విధానం అర్థం చేసుకోవడానికి ఎంతో అనుభవం ఉన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆరు నెలలు సమయం పట్టింది. పారిశ్రామిక వాతావరణాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మాడుగుల నియోజకవర్గానికి వచ్చానని, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజల దృష్టిని మరలించేందుకు వైసీపీ నేతలు నరుకుతాం, నరికేస్తాం అనే భాషలో మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. గంజాయి మత్తులో కానిస్టేబుల్‌ను కొట్టిన యువకుడిని పరామర్శించడమేంటి ఇది సిగ్గుచేటని అన్నారు. మంత్రి వ్యాఖ్యలు మాడుగుల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్న పార్థసారథి వ్యాఖ్యలకు వైసీపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, జిల్లాస్థాయి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.