MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టైనా హత్య కేసులో ఎన్నో అనుమానాలు.!
MLC Ananthababu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో MLC అనంతబాబును అరెస్టు చేశారు.;
MLC Ananthababu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో MLC అనంతబాబును అరెస్టు చేశారు. ఐనా.. అనేక అంశాల్లో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోందంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కస్టడీలో ఉన్నప్పుడు నేరాన్ని ఒప్పుకున్న అనంతబాబు.. కట్టుకథలతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడంటున్నారు.
అదే సమయంలో దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సిన పోలీసులు.. ముద్దాయి చెప్పింది మీడియాకు వివరించారే తప్ప పూర్తిస్థాయిలో ఆధారాల సేకరణపై ఎందుకు దృష్టి పెట్టలేదని దళిత సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. అనంతబాబు అరెస్టును చూపించిన సందర్భంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఎస్పీ.. ఈనెల 19న రాత్రి 10:15 నిమిషాల ప్రాంతంలో కొండయ్యపాలెం వద్ద సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి కనిపించాడని చెప్పారు.
అటుగా కారులో వెళ్తున్న అనంతబాబు అతన్ని వెంట తీసుకెళ్లారని వివరించారు. ఐతే.. మృతుడి భార్య అపర్ణ వాదన మరోలా ఉంది. తన భర్తను అనంతబాబే ఇంటికి వచ్చి తీసుకువెళ్లారని అంటోంది. ఆమె ఈ హత్య విషయం బయటపడినప్పటి నుంచి అదే మాట చెప్తోంది. కానీ పోలీసులు ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదు.. కేవలం MLC చెప్పిందే మీడియాకు ఎందుకు చెప్పారనే ప్రశ్న ఉదయిస్తోంది.
MLC అనంతబాబు క్షణికావేశంలో కొట్టడం వల్లే సుబ్రమణ్యం చనిపోయాడని ఎస్పీ అన్నారు. తమ విచారణలో MLC చెప్పిన దాని ప్రకారం 20 వేలు అప్పు విషయంపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందంటున్నారు. దీన్ని సుబ్రమణ్యం భార్య ఖండిస్తోంది. కోట్లకు కోట్లు ఆస్తి ఉన్న MLCకి 20 వేల కోసం మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. ఐనా.. 70 వేల అప్పులో 50 వేలు తీర్చేసిన తన భర్త 20 వేలు ఎందుకు తీర్చలేడని ప్రశ్నిస్తోంది.
డబ్బుల విషయంపై గొడవ అనడం అబద్ధమని వాదిస్తోంది. ఈమె చెప్తున్న వాదన ప్రకారం పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇక హత్య ఎక్కడ జరిగింది అనే విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలో అనంతబాబు స్టేట్‌మెంట్‌పై ఆధారాపడి పోలీసులు మాట్లాడుతున్నారే తప్ప ఎందుకు లోతైన దర్యాప్తు జరగడం లేదని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
SP చెప్పిన దాని ప్రకారం అనంతబాబుకు- సుబ్రమణ్యానికి గొడవ జరిగింది MLC అపార్ట్‌మెంట్ దగ్గర. అదే నిజమైతే.. ఏ ఇనుప రాడ్ తగిలి డ్రైవర్ తలకు గాయమైంది.. ఇద్దరికీ ఎక్కడ తోపులాట జరిగిందీ అనేది పోలీసులు వివరించాలి. కానీ అది జరగలేదు. అటు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కూడా పోలీసుల వాదనను తోసిపుచ్చారు. హత్య జరిగినట్టు చెప్తున్న టైమ్‌లో అనంతబాబు అపార్టుమెంట్‌లోనే లేరు అని వివరిస్తున్నాడు వాచ్‌మెన్ శ్రీను. సాయంత్రం వెళ్లి రాత్రి 1 గంటకు ఆయన తిరిగి వచ్చారని, మళ్లీ బయటకు వెళ్లిపోయారని చెప్తున్నాడు.
పోలీసులు విచారణకు రాలేదని కూడా అంటున్నాడు. ఇది కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. అనంతబాబు విషయంలో పోలీసులు ఎవరి ఒత్తిడీ లేకుండా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎవరెవర్ని తప్పించేందుకు MLC ప్రయత్నించారో తేల్చాలంటోంది. ఇప్పటికైనా గన్‌మెన్‌లను విచారించాలని, అలాగే ఆయన కాల్‌డేటా చెక్ చేయాలని కోరుతున్నారు.