వైసీపీ నేతలకు చంద్రబాబు సింహస్వప్నం : ఎంపీ కనకమేడల

Update: 2020-09-12 10:11 GMT

సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ సమస్యల్ని పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు టీడీపీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్నికేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. వైసీపీ పాలనను పక్కకు పెట్టి కక్ష సాధిస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. ఏపీలో అప్రకటిత అత్యయిక స్థితి నడుస్తోందని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. లారీతో తొక్కిస్తానని మంత్రి అంటే పోలీసులు కేసు పెట్టరా అని కనకమేడల ప్రశ్నించారు. కొవిడ్‌ నియంత్రణలో వైసీపీ విఫలమైందని విమర్శించారు. కరోనా నియంత్రణ చర్యల్లోనూ అవినీతి జరిగినట్టు ఆఱోపణలు ఉన్నాయని అన్నారు.

దేవాలయాలపై దాడులు, భూముల అన్యాక్రాంతానికి కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ కనకమేడల అన్నారు. అంతర్వేది ఘటనను సీబీఐ విచారణకు ఆదేశించి.... జగన్‌ సర్కారు చేతులు దులుపుకుందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు చంద్రబాబు సింహస్వప్నంలా మారారని అన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని కనకమేడల ప్రశ్నించారు. 28 మంది ఎంపీలు ఉన్నా హోదా ఎందుకు సాధించలేదని అన్నారు. కేంద్రంపై పోరాడతారో, రాజీనామా చేస్తారో వైసీపీ నేతలే నిర్ణయించుకోవాలని అన్నారు.

Tags:    

Similar News