Mysterious Disease : అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి
అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.