అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం అనే సూత్రాలపైనే జగన్ పాలన : నారా లోకేష్
Nara Lokesh : గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన ఒక వేయి 309 కోట్లను తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.;
Nara Lokesh : గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన ఒక వేయి 309 కోట్లను తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమచేయాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. జగన్ సర్కార్.. అప్పులు తేవడం, ఆస్తులు అమ్మడం, తాకట్టు పెట్టడం అనే మూడు సూత్రాలపైనే పాలన సాగిస్తున్నారంటూ విమర్శించారు. ఈ మూడు మార్గాలు కూడా అయిపోవడంతో కొత్తగా నిధుల మళ్లింపుపై పడ్డారని కామెంట్ చేశారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని మండిపడ్డారు. మళ్లించడానికి వీలులేని ఆర్థిక సంఘం నిధులనే జగన్ వాడేశారంటే.. ఈ ప్రభుత్వం పూర్తిగా బరితెగించేసిందని అర్థం అవుతోందన్నారు నారా లోకేష్.
సర్పంచ్, వార్డు సభ్యులకు తెలియకుండా పంచాయతీ ఖాతాల నుంచి నిధులు మళ్లించడం స్థానిక సంస్థల ప్రతినిధులను మోసం చేయడమేనన్నారు నారా లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసానికి గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయన్నారు. పల్లెల్లో పారిశుధ్యం పూర్తిగా దిగజారిందని, పల్లె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో.. గ్రామానికి సర్పంచ్ కూడా అంతేనని, అలాంటి సర్పంచులను ఆటబొమ్మల్ని చేసి, పంచాయతీల నిధులు దోపిడీ దొంగలా మాయం చేయడం అన్యాయం అని కామెంట్ చేశారు.