జనగళమే యువగళమై..2000 KM మైలురాయిని చేరిన పాదయాత్ర

లోకేష్‌ యువగళం పాదయాత్ర 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని చేరుకుంది.

Update: 2023-07-11 03:45 GMT

నారా లోకేష్ యువగళం పాదయాత్ర సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. జనగళమే యువగళమై సాగుతున్న యాత్ర నిర్దేశిత లక్ష్యానికంటే ముందుగానే 2 వేల కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10 కిలోమీటర్ల మేర చొప్పున నడవాలని తొలుత లక్ష్యంగా నిర్ణయించుకున్న లోకేష్ అంతకంటే ఎక్కువే నడిచారు. 153 రోజుల్లో సగటున 13.15 కిలోమీటర్ల చొప్పున 2 వేల కిలోమీటర్లు నడిచారు. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లక్ష్యంగా నడక ప్రారంభించిన లోకేష్‌ వడివడిగా అడుగులు వేస్తూ 153 రోజుల్లోనే 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.

జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన లోకేష్‌ యువగళం పాదయాత్ర 153వ రోజున కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2వేల కి.మీ.ల మైలురాయిని చేరుకోనుంది. జన ప్రభంజనాన్ని తలపిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. యువగళానికి ప్రజలనుంచి రోజురోజుకు పెరుగుతున్న మద్దతు అధికారపార్టీ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లక్షలాది ప్రజలను నేరుగా కలుస్తూ, అనుక్షణం ప్రజల్లో మమేకమవుతూ, కన్నీళ్లు తుడుస్తూ యువనేత చేస్తున్న పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ సకల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉక్కుసంకల్పంతో లోకేష్‌ ముందుకు కదులుతున్నారు.

153 రోజుల పాదయాత్రలో లోకేష్ సుమారు 30 లక్షలమంది ప్రజలను నేరుగా కలుసుకున్నారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగగా, 49 చోట్ల బహిరంగసభలో లోకేష్‌ ప్రసంగించారు. వివిధవర్గాలతో 118 ముఖాముఖి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మహిళలు, యువత, ముస్లింలు, సర్పంచులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. యువనేత పాదయాత్రలో వివిధవర్గాల ప్రజలనుంచి 2,895 రాతపూర్వక వినతిపత్రాలు అందాయి. ఐదు చోట్ల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాలకు పల్లెప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

యువగళం పాదయాత్ర రాయలసీమలో చరిత్ర సృష్టించింది. గతంలో మరే నాయకుడు చేయని విధంగా రాయలసీమలో 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్లు పాదయాత్ర చేసి లోకేష్‌ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 45రోజులు 577 కిలోమీటర్లు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23రోజులు – 303 కిలోమీటర్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజులు 507 కిలోమీటర్లు, ఉమ్మడి కడప జిల్లాలో 16 రోజుల పాటు 200 కిలోమీటర్ల మేర లోకేష్‌ పాదయాత్ర చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో ఇప్పటివరకు 29రోజుల పాటు 425 కి.మీ. మేర పాదయాత్ర పూర్తయింది. యువగళం పాదయాత్ర 153వ రోజు కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయి చేరుకోనుంది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం కొత్తూరులో పైలాన్‌ను ఆవిష్కరించునున్నారు.

లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ మాటల తూటాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర సాగిన 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 చోట్ల యువనేత లోకేష్ బహిరంగసభల్లో ప్రసంగించారు. ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 2.25 లక్షలమంది అభిమానులతో ఫోటోలు దిగారు. నెల్లూరులో అత్యధికంగా ఒకేరోజు 2,500మంది యువనేతతో సెల్ఫీ దిగారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించారంటే యువగళం గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతున్నారు నారా లోకేష్‌. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. మరోవైపు లోకేష్ చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేని వైసిపి ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడికి దిగుతున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల ఏర్పాటుద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలతో యువతకు భరోసా ఇస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు పంపిస్తామని హామీ ఇచ్చారు. బిసిల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలపై ఆయా వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.

Tags:    

Similar News