పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు
క్రీస్తు విలేజ్ పేరుతో యూట్యూబ్‌లో విడుదల చేస్తున్న ప్రసంగాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.;
హిందూ దేవుళ్ల విగ్రహాల కూల్చివేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పాస్టర్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ.. విచారణను మరింత వేగవంతం చేసింది. ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన నివాసాలు, విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. గుంటూరు, రాజమండ్రి నుంచి సీఐడీ పోలీసులు బృందాలుగా విడిపోయి సామర్లకోటలోని ప్రవీణ్ చక్రవర్తి కాలేజీలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడినట్లు విడుదలైన వీడియోపై కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐడీ ఎస్పీ రాధిక చెప్పారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఏ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చారు? ఎక్కడి విగ్రహాలు.. ఎలా ధ్వంసం చేశారన్న దానిపై విచారణ చేస్తామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రానిక్ ఆధారాలు సేకరించామని, మరిన్ని ఆధారాలను సహ కుట్రదారులు దాచినట్లు అనుమానిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రవీణ్‌ను విచారిస్తున్న అధికారులు.. క్రీస్తు విలేజ్ పేరుతో యూట్యూబ్‌లో విడుదల చేస్తున్న ప్రసంగాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.