కాలుష్య మండలి సంబంధించిన దస్త్రాలు, నివేదికలను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. అలాగే పీసీబీ కార్యాలయాల్లో దస్త్రాలు, నివేదికలను ఏ మేరకు భద్రంగా ఉన్నాయి. వాటిని భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశించారు.
మరో పక్క కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన దస్త్రాలను తగులబెట్టిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి, కరకట్టపై చెత్తా చెదారాలు పారబోసిన ప్రాంతంలో బస్తాలను దించి తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.