BABU ARREST: ఓవైపు నిరసనలు.. మరోవైపు పూజలు

చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ శ్రేణుల ఆందోళనలు... జగన్‌ సర్కార్‌ పనైపోయిందని మండిపాటు...;

Update: 2023-09-18 03:15 GMT

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ నాయకుడిపై అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ తెలుగుదేశం శ్రేణులు నిరసన ప్రదర్శనలతో కదం తొక్కుతున్నాయి. ఏ తప్పు చేయని చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారంటూ కార్యకర్తలు రాత్రి వేళ దీక్షలు, కొవ్వొత్తులు, కాగడాలతో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధినేత త్వరగా బయటకు రావాలంటూ తెలుగుదేశం నాయకులు పలు ప్రాంతాల్లో హోమాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.


చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా శంకరాపురంలో టీడీపీ శ్రేణులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అధినేత ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కనిగిరిలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని నేతలు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ, జనసేన నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావలిలో టీడీపీ నేతలు చేస్తున్న దీక్షకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌ రెడ్డికి అందరూ దొంగల్లా కనిపిస్తున్నారని.. కక్షపూరిత ధోరణితో కేసులు పెట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. అనంతరం టీడీపీ, జనసేన నేతలు జగన్‌కి వ్యతిరేకంగా నినాదులు చేస్తూ కాగడాల ప్రదర్శనల చేశారు.


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలతో నిరసన తెలిపారు. పామర్రు మండలం జేమిగోల్వేపల్లిలో మహిళా కార్యకర్తలు బాబు జగజ్జీవన్‌ రామ్‌కి నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. చంద్రబాబుకి జైలులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడాన్ని నిరసిస్తూ చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామస్థులు ఆరుబయటే నిద్రించారు. చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని పమిడిముక్కల మండలం పెనుమత్సలో ఆ పార్టీ నేతలు శ్రీ అభయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజులు చేశారు.

విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో మహిళలు, నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పార్టీ అధినేత జైలు నుంచి త్వరగా విడుదల అవ్వాలని... గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలయేసు చర్చిలో తెదేపా నేత తెనాలి శ్రావణ్‌ కుమార్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. వైసీపీ ప్రభుత్వ దమనకాండను వ్యతిరేకిస్తూ... మంగళగిరిలో టీడీపీ మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ వారిని నెట్టుకుంటూ మహిళలు ర్యాలీని కొనసాగించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుని ప్రజలకు తెలిసేలా గుంటూరులోని ప్రధాన కూడళ్లలో మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని బాపట్ల జిల్లాలో టీడీపీ శ్రేణులు ర్యాలీలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మచ్చలేని నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. పెదకూరపాడులో మహిళలు కదం తొక్కారు.

Tags:    

Similar News