Eluru: ఏపీలో జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత.. ఏలూరు సభ నుండి మధ్యలోనే వెళ్లిపోయిన జనం..
Eluru: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది.;
Eluru: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. వైసీపీ మూడేళ్ల పాలనపై ఇప్పటివరకు విపక్షాలు విరుచుకుపడుతుండగా.. ఇప్పుడు జనం వంతైంది. సీఎం సభలకు వస్తున్న ప్రజలు కాసేపు కూర్చొని వెనుతిరుగుతున్నారు. అటు.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులకు నిరసన సెగలు తప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాలికొదిలేశారని మండిపడుతున్నారు.
సీఎం జగన్ తాజాగా ఏలూరు జిల్లా గణపవరంలో నిర్వహించిన రైతు భరోసా సభలో పాల్గొన్నారు. అయితే.. సీఎం తన ప్రసంగం మొదలెట్టగానే జనం బయటికి వెళ్లేందుకు క్యూ కట్టారు. సీఎం మాట్లాడుతున్న సమయంలోనే సగం ప్రాంగణం ఖాళీ అయింది. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. బయటికి వెళ్లిపోతున్న వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు, పోలీసులు. ఒక 10 నిమిషాలు ఆగాలని పోలీసులు బతిమలాడారు.
అయినా ఎవరి మాట వినకుండా.. జనం వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక.. విజయనగరం జిల్లా రాజాంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు భరోసా సమావేశం నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఏకంగా మంత్రే డుమ్మా కొట్టారు. ఆ సభ కూడా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. దీంతో ఖాళీ కుర్చీలను నింపేందుకు జనాల కోసం వెతుకులాట మొదలు పెట్టారు.
అటు.. మంత్రి వచ్చి ఉండుంటే ఖాళీగా ఉన్న ప్రాంగణం చూసి పరువు పోయేదన్న చర్చ జరిగింది. ఇదిలా ఉంటే.. వైసీపీ పాలనపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో.. ఓ మహిళ జగన్ సర్కార్‌పై ఒంటి కాలుపై లేచింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదని ఓపెన్ ఛాలెంజ్ చేసింది. అందుకు ఎకరంన్నర పొలం బెట్టు కాసింది.
జగన్మోహన్ రెడ్డి పాలన అధ్వాన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటిన్ తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పడం లేదు. కొందరు గడపలోనే నిలదీస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీకి నిరసన సెగ తగిలింది.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నాటుసారా నిర్మూలించాలని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్థానికులు ధర్మశ్రీని ప్రశ్నించారు. కమ్యూనిటీ హాలు, రోడ్డు, పక్కా ఇళ్ల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫించన్, రేషన్ కార్డులను కట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరు గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ చేరలేదని మహిళలు నిలదీశారు. ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రజలకు సమాధానాలు చెప్పలేక వెనుతిరుగుతున్నారు.