NAREE SHAKTHI: తీవ్ర ఉద్రిక్తంగా నారీ శక్తి
విశాఖ బీచ్‌లో మహిళలపై పోలీసుల ఉక్కుపాదం... మహిళా నేతల అరెస్ట్;
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విశాఖ బీచ్‌లో మహిళలు చేపట్టిన నారీశక్తి కార్యక్రమంపై పోలీసులు జులుం చూపించారు. ఆంక్షలు, అరెస్టులతో నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.. చంద్రబాబుకు మద్దతుగా తరలివచ్చిన మహిళలను, తెలుగుదేశం నాయకులను పోలీసులు అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. నిరసనగా రోడ్లపై కూడా నడవనివ్వరా అంటూ పోలీసుల జులుంపై మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నారీశక్తి కార్యక్రమానికి సాయంత్రం 5 గంటలకు మహిళలు పిలుపునివ్వగా పోలీసులు అప్రమత్తమయ్యారు. 2-3 గంటల ముందు నుంచే అనిత సహా ముఖ్య మహిళా నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఎవరినీ బయటకు రానీయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసుల ఆంక్షల్ని ఛేదించుకుని చాలా మంది మహిళలు బీచ్ వద్దకు చేరుకుని నిరసనగా నడిచేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడికి చేరుకున్న సుమారు 500 మంది పోలీసులు ఎవరినీ నిరసనలు తెలపకుండా అడ్డుకున్నారు.
బీచ్ రోడ్డులో నిరసనగా నడిచేందుకు సిద్ధమైన మహిళల్ని... పోలీసులు విచక్షణారహితంగా లాగిపడేస్తూ వాహనాల్లోకి ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని బలవంతంగా లాక్కెళ్లారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళలు మాట్లాడుతున్నా... వినకుండా పోలీసులు వారిని లాక్కుంటూ తీసుకెళ్లారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతుండగానే పోలీసులు ఆమెను మాట్లాడనీయకుండా లాక్కెళ్లారు. వారికి మద్దతుగా మాట్లాడేందుకు వచ్చిన కార్యకర్తలనూ మాట్లాడుతుండగానే బలవంతంగా లాక్కెళ్లారు.
శాంతియుత నిరసనలనూ పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ... తెలుగుదేశం మహిళా కార్పొరేటర్... ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పోలీసులు విగ్రహం వద్దకు వెళ్లి ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన పెద్ద వయసు మహిళలనూ పోలీసులు వదల్లేదు. కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తోసుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం మహిళలకు మద్దతు తెలిపేందుకు బీచ్ వద్దకు వచ్చిన జనసేన వీర మహిళలనూ పోలీసులు అరెస్టు చేశారు.