విశాఖ తూర్పులో రెండోరోజూ టెన్షన్‌ టెన్షన్‌

Update: 2020-12-27 06:00 GMT

విశాఖ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల యుద్ధం నడుస్తోంది. ఈస్ట్‌ పాయింట్‌లోని సాయిబాబా ఆలయం వేదికగా రాజకీయ రచ్చ నడుస్తోంది. కయ్యానికి కాలు దువ్వడమే పనిగా వైసీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తుండటం విమర్శలకు కారణమవుతోంది. ప్రమాణాలపై పొలిటికల్‌ హైడ్రామా జరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి ఏ క్షణం ఎలా మారుతుందోనన్న ఆందోళన నెలకొంది.

బినామీ భూములు ఉన్నాయంటూ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై.. ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేయగా.. దాన్ని తీవ్రంగా ఖండించిన వెలగపూడి.. తన సచ్ఛీలతను నిరూపించుకోవడానికి సిద్ధమని.. ఈస్ట్ పాయింట్‌లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఈ సవాల్‌ స్వీకరించాల్సింది విజయసాయిరెడ్డి అయితే, తూర్పు వైసీపీ నేతల్ని ఉసిగొల్పుతున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ వైసీపీ నేత సవాల్‌ విసరగా.. ఈరోజు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ కూడా బాబా ఆలయానికి రావాలంటూ వెలగపూడికి సవాల్‌ విసిరారు.

అయితే, వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తాను విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరితే.. వీళ్లంతా ఎవరంటూ కొట్టిపడేస్తున్నారు.. దమ్ముంటే విజయసాయిరెడ్డి తన సవాల్‌ను స్వీకరించాలంటున్నారు.. సాయిరెడ్డి వస్తేనే బాబా ఆలయంలో ప్రమాణానికి తాను సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే వెలగపూడి. అటు తాజా పరిణామాల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తూర్పు నియోజకవర్గంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈస్ట్‌ పాయింట్‌లోని బాబా ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


Tags:    

Similar News