AP: బహిర్గతమైన రుషికొండ రాజమహల్ రహస్యం
విలాసవంతమైన భవనాలు చూసి నోరెళ్లబెట్టిన ప్రజలు... కళ్లు చెదిరిపోయే సదుపాయాలు;
రుషికొండ రాజమహల్ రహస్యం బహిర్గతమైంది. మూడున్నరేళ్ళుగా సామాన్య ప్రజలు, రాజకీయ నేతల కన్ను కూడా పడకుండా 500 కోట్ల రూపాయల ప్రజా సొమ్ముతో నిర్మించిన రుషికొండ భవనాలను నేడు తెలుగుదేశం నేతలు సందర్శించారు. విలాసవంతమైన భవనాలు.. కళ్లు చెదిరిపోయే ఇంటీరియర్... లగ్జరీ ఫర్నీచర్... కళ్లు మిరుమిట్లుగొలిపేంత విద్యుత్ దీపాలు ఇదీ సప్త రుషులైన నిలువైన రుషికొండపై జగన్ కట్టిన రాజప్రాసాదం. ఇన్నాళ్లు వైసీపీ పాలనలో రహస్యంగా ఉండిపోయిన రుషికొండ రహస్యం ఇవాళ్టీతో బహిర్గతమైంది. కోట తలుపులు తెరుచుకోగానే 500 కోట్ల రూపాయల ప్రజా ధనంలో నిర్మించిన ఆ విలాస భవనాలను చూసి అందరూ నివ్వెరపోయారు. టూరిజం భవనాలను కూల్చి నిర్మించిన ఈ రాజ భవనాలు వైసీపీ ప్రజా ధన దుర్వినియోగానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచాయి.
పర్యావరణ అనుమతుల నియమాలు పక్కన పెట్టి ప్రజా సొమ్ముతో పర్యాటక శాఖ భవనాలు పేరు చెప్పి 9.8 ఎకరాలు విస్తీర్ణంలో ఏడు బ్లాక్‌లు నిర్మించారు. ఈ రుషికొండ నిర్మాణాలపై అడుగు పెట్టగానే మొదటి ప్రవేశ మార్గం దగ్గర... వెంగి 1, వెంగి 2 బ్లాక్‌లు దర్శనమిస్తాయి. అత్యంత విలాసవంతంగా ఈ భవనాలను నిర్మించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గ్రానైట్‌లను నిర్మాణంలో వినియోగించారు. విద్యుత్ సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు. TTD వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగానే ఈ వెంగి వన్, వెంగి టు బ్లాక్‌లను నిర్మించారు.
ప్రవేశ ద్వారాల వద్ద వెంగి వన్, వెంగి టు భవనాలను అనుకునే కళింగ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్‌లోని భవనాలు రాజ ప్రాసాదానికి ఏం తక్కువగా లేవు. ఇందులోనే సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 500 మంది కూర్చొనే సమావేశ మందిరం, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూం ఉన్నాయి. ఇందులోని ఫర్నీచర్‌లు చూస్తే మతిపోవాల్సిందే. ఈ ఏర్పాట్లన్నీ కార్యాలయం కోసం అనేలా లేవని అత్యంత విలాసవంతమైన నివాసం కోసమే అనిపించేలా ఉన్నాయి. ఈ బ్లాక్‌లోనే బాత్ టబ్‌లు, విలాసవంతమైన మంచాలు.
360 డిగ్రీల లైట్లు, విభిన్నమైన ఫ్యాన్లు, ఖరీదైన కర్టెన్లు ఉన్నాయి. రుషికొండ భవనాల్లో ఒక్కో బాత్‌రూమ్‌కే కోటి రూపాయలకుపైగా ఖర్చు చేసినట్లు... తెలుస్తోంది. బాత్‌రూమ్‌లో స్పాతోపాటు సెంట్రలైజ్డ్ ఏసీ కూడా ఉండడం తెలుగుదేశం నేతలను ఆశ్చర్యపరిచింది.
కళింగ బ్లాక్ తర్వాత గజపతి చిన్న బ్లాక్ చివరిలో విజయ నగర 1, 2, 3 నివాస సముదాయాలు ఉన్నాయి.విజయనగర బ్లాక్‌లోని ఈ మూడు విలాసవంతమైన భవనాలు రుషికొండ బీచ్‌కు అభిముఖంగా ఉన్నాయి. విజయనగర బ్లాక్ ముందు పెద్ద ఉద్యానవనం నిర్మించారు. ఈ భవనాల్లో మొత్తం నిర్మాణాల్లో పూర్తిగా వియత్నాం గ్రానైట్, మార్బుల్, ఇటాలియన్ గ్రానైట్ వినియోగించారు. ఫర్నిచర్ మొత్తం వియత్నాం దేశం నుంచి తీసుకొచ్చారు. మొత్తం భవనాలకు నాలుగు జనరేటర్లు, ఒక సోలార్ పవర్ అసిస్టెంట్ బ్లాక్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రుషికొండలో విలాసవంతమైన భవనాల నిర్మాణాల కోసం... 500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. కొండ తొలిచే పనులకు 90 కోట్లు...ల్యాండ్ స్కేపింగ్‌కు 61 కోట్లు ఖర్చు చేశారు. ఈ భవనాలను.. పర్యాటక అవసరానికి తగ్గట్టు నిర్మించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. భవనాలను సీఎం క్యాంప్ ఆఫీసుగా.. అధికారిక నివాసంగా మార్చేందుకు నిర్మించారని విమర్శించారు.
ఇంత విలాసవంతమైన భవనాలను ఇప్పుడు ఎలా వినియోగించాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది.