AP: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...మూడేళ్ల చిన్నారి సహా మరో ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో తెల్లవారుజామునే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి తో పాటు మరో ఇద్దరిని అనంత లోకాలకు తీసుకెళ్లింది. సంతోషంగా కుటుంబం అంతా కలిసి హైదరాబాద్ నుండి మైదుకూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్ద ఉన్న కాశిరెడ్డినాయన ఆశ్రమం సమీపంలో గురువారం తెల్లవారుజామున వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళుతున్న స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనక నుండి ఢీ కొట్టింది. ఉదయం ఐదు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనంలో మొత్తం పదిమంది ప్రయాణిస్తుండగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మున్ని (35), కమల్ బాష (50)గా గుర్తించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మూడేళ్ల చిన్నారి షేక్ నదియా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఓర్వకలు పోలీసులు విచారణ చేపట్టారు.