SIT: కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం
షరతులు ఎందుకు మార్చారంటూ సిట్ ప్రశ్నలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కాంట్రాక్టులు ఎవరెవరి సిఫారసు మేరకు కుదిరాయి? కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్‌గా మీ పాత్ర ఏమిటి? మైసూర్‌లోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టులు ఇచ్చిన తర్వాత కూడా భోలే బాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు? అంత భారీస్థాయిలో నెయ్యి సేకరణకు సంబంధించిన ఫైళ్లను మీ పీఏ అప్పన్న ఎందుకు చూశారు? అంత అధికారం మీరెందుకు ఇచ్చారు? వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి?.... అంటూ వైఎస్ జగన్ బాబాయ్, టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు గురువారం హైదరాబాద్‌లో వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయనను ప్రశ్నించారు. సుమారు ఏడుగంటలపాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది. ఈ కేసులో 24మందిపై కేసు నమోదు చేసిన ‘సిట్’ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది. టీటీడీ మాజీ ఇన్చార్జి ఈవో ధర్మారెడ్డితోపాటు చిన్న అప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వైవీని ప్రశ్నించారు.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదాన్ని అపవిత్రం చేయడమే కాకుండా భక్తుల మనోభావాలు, విశ్వాసాన్ని దెబ్బతీయడంతో పాటు స్వామివారికి అపకీర్తిని తెచ్చేందుకు కారణమయ్యారు గత పాలకులు. దీనిపై నమోదైన కేసులో సిట్ వాస్తవాల్ని బయటకు రాబట్టే పనిలో ఉంది. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువుర్ని విచారించిన సిట్, ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని వైవీ సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా తెలుస్తోంది.మాజీ చైర్మన్ సిట్ విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో వైవీ సుబ్బారెడ్డి ఇంట్లోనే అధికారులు ప్రశ్నిస్తున్నారు.