పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల నడుమ మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పటికే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టు మీద రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా సమన్వయం చేసుకోవాలి.. దీన్నంతా కేంద్రం చూసుకుంటుంది అంటూ ఈ నెల 12కు వాయిదా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం తానే ఆపానని.. ఇప్పుడు పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు కూడా ఆపుతానంటూ చెప్పారు. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టు వైసీపీ రెచ్చిపోయింది. రాయలసీమకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. కృష్ణా జలాలను రాకుండా ప్రాజెక్టు ఆపేసిందంటూ రకరకాల తప్పుడు ప్రచారానికి తెరతీసింది. దీని మీద కూటమి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
జగన్ సీఎంగా ఉన్నప్పుడే 2020లో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ఎలాంటి అనుమతులు, డీపీఆర్ లేకుండా రూ.3కోట్లకు పైగా కాంట్రాక్టులు పిలిస్తే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెబితే ఎన్టీజీ స్టే విధించింది. అదే విధంగా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు కూడా స్టే విధించింది. 2020లోనే ఆ పనులు ఆగిపోయాయి. అప్పటి ప్రభుత్వం ఆగిపోయినట్టు అఫిడవిట్ కూడా ఇచ్చిందనే విషయాలు అన్నీ బయటపెట్టింది. దీనిమీద వైసీపీ స్పందించట్లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిందే నిజం అన్నట్టు ఫేక్ పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో గందరగోళం రేపుతోంది.
ఇప్పుడు దానిపై చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల నడుమ విద్వేషం కాదు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. తాను సీఎంగా ఉన్నప్పుడే నెట్టెంపూడి, కల్వకుర్తితో పాటు గోదావరిపై అనేక ప్రాజెక్టులు తెలంగాణ ప్రజల కోసం కట్టినట్టు గుర్తు చేసుకున్నారు. గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం కట్టినా తాను అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుకు చట్టబద్ధత లేదు కాబట్టే అది ఆగిపోయిందని.. తాను ఏపీకి అక్రమంగా నీటిని వాడుకునే అవసరం లేదని తెలిపారు. చట్టబద్ధంగా రావాల్సిన నీటి మాత్రం వాటుకుంటామన్నారు. ఇక్కడే వైసీపీకి, కూటమికి ఎంత తేడా ఉందో అర్థమైపోతోంది. వైసీపీ ఏ చిన్న ఛాన్స్ దొరికినా కూటమిపై బురద జల్లేందుకు ఎలా రెడీగా ఉంటుందో దీంతో మరోసారి తేలిపోయింది.