Mithun Reddy : ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్

Update: 2025-09-19 07:57 GMT

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ తమ కస్టడీలోకి తీసుకుంది. రెండు రోజుల పాటు ఆయన్ను విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించడంతో ఈ ఉదయం సిట్ అధికారులు ఆయన్ను రాజమండ్రి నుంచి విజయవాడకు తరలించారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చిన సిట్, ఆయన్ను ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆయన్ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మిథున్ రెడ్డిని విచారించనున్నారు. కాగా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇదివరకే తిరస్కరించింది. ఈ కేసులో సుమారు రూ. 3,500 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈడీ ఎంట్రీ.  మరోవైపు ఈ కేసు దర్యాప్తులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. కేసు తీవ్రత దృష్ట్యా ఈడీ అధికారులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు, నగదు వివరాలపై సిట్ అధికారులతో ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో లిక్కర్ స్కాం దర్యాప్తు మరింత వేగవంతమైంది.

Tags:    

Similar News