Vegetable Prices : భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు

Update: 2024-05-29 06:05 GMT

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు 2, 3 రోజుల్లోనే 20-30% పెరిగాయి. కేజీ టమాటా రూ.25-30 నుంచి రూ.60కి, పచ్చి మిర్చి రూ.80 నుంచి రూ.120కి, కందిపప్పు రూ.110-120 నుంచి రూ.200కి పెరిగింది. బీన్స్ అయితే రూ.150గా ఉంది. ఏ కూరగాయ కేజీ రూ.50 కంటే తక్కువ లేదు. చికెన్ కేజీ రూ.260 నుంచి రూ.300కి చేరింది. మటన్ రూ.1000 పలుకుతోంది. స్టాక్ తగ్గడం, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతుల వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

కూరగాయల తర్వాత వంటల్లో ఎక్కువగా వాడే పప్పుల రేట్లు అంతకంటే ఎక్కువే అయ్యాయి. మొన్నటి వరకు కిలో రూ.110–120 పలికిన కందిపప్పు ఇప్పుడు రూ.200కు చేరింది. క్వాలిటీ ఆధారంగా శనగపప్పు రూ.90–100, మైసూర్‍ పప్పు రూ.110–120, పెసర పప్పు రూ.140, మినుముల పప్పు రూ.140–150 అయింది. పల్లినూనె కిలో రూ.180–190 ఉండగా.. సన్​ ఫ్లవర్​ ఆయిల్​​120–125 వరకు అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.200 ఉంటే ఎల్లిగడ్డ రూ.320 పలుకుతోంది. చింతపండు కూడా రూ.120–130 అవడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.

టమాట ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూర్‍ జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి, మిర్చి మధ్యప్రదేశ్‍, ఇతర కూరగాయలతో పాటు క్యారెట్‍, క్యాప్సికం వంటివి కర్నాటక నుంచి ఎక్కువగా వస్తున్నట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి చెడగొట్టు వానల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో అవసరానికి అనుగుణంగా సాగు లేక మార్కెట్లకు స్టాక్‍ రావడం తగ్గింది.

Tags:    

Similar News