Sri Krishna Janmashtami : మంగళగిరిలో ఈనెల 15 నుంచి శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు

Update: 2025-08-12 12:45 GMT

మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కొలనుకొండ లోని హరే కృష్ణ గోకుల క్షేత్రం ఆవరణలో ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు హరే కృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస తెలిపారు. మంగళవారం ఆత్మకూరు అక్షయపాత్ర ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఈనెల 15,16, 17 తేదీల్లో రాత్రి 9:30లకు కృష్ణుడికి మహాభిషేక పూజలు జరుగుతాయని, అందులో భాగంగా 108 పవిత్ర జల కలశాలతో, పండ్ల రసాలు, పంచామృతం, పంచగవ్యాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో మహాభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాత్రి 12 గంటలకు మహా మంగళహారతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా బృందావనం నుంచి వచ్చిన లడ్డు గోపాలునికి ఉయ్యాల సేవ జరుగుతుందని, ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, ఉట్టి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కావున భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పబ్లిక్ రిలేషన్స్ హెడ్ రఘునందన్ దాస తో పాటు పలువురు అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News