AP: ఆంధ్రప్రదేశ్‌ సభకు ప్రధాని మోదీ

టీడీపీ-జనసేన-బీజేపీ సంయుక్తంగా సభ నిర్వహణ.... ఈ నెల 14న రెండో జాబితా ప్రకటన

Update: 2024-03-10 02:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఖరారవడంతో పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో 3 పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన బహిరంగసభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఈ సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు తెలుగుదేశం, జనసేన సన్నాహాలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ కూడా జత కలిసింది. ప్రధాని వెసులుబాటును బట్టి ఈనెల 17 లేదా 18న సభ జరుగుతుందని సమాచారం. తెలుగుదేశం, జనసేన, భాజపా పోటీచేసే స్థానాలు, అభ్యర్థుల జాబితాలను ఈ నెల14నాటికి ఖరారు చేయనున్నారు. ఎన్నికల షెడ్యూలు ఈనెల 15, 16 తేదీల్లో వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై.. మూడు పార్టీలూ దృష్టి సారించాయి. జనసేన, బీజేపీలకు కలిపి 30 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను కేటాయించాలన్న ప్రతిపాదనను... అమిత్‌షా, నడ్డా స్వాగతించినట్లు సమాచారం. వాటిలో ఏ పార్టీ ఎన్నిస్థానాల్లో పోటీచేయాలోజనసేన, బీజేపీ కలిసి నిర్ణయించుకోనున్నాయి. పొత్తు ఖరారైన నేపథ్యంలో సీట్లు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై తదుపరి చర్చలన్నీ అమరావతిలోనే జరగనున్నాయి.


బీజేపీ సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్‌ జీ సోమవారం విజయవాడ వస్తారని, మొదట పవన్‌ కల్యాణ్‌తో, తర్వాత చంద్రబాబుతోనూ చర్చిస్తారని తెలిసింది. బీజేపీతో పొత్తు ఖరారుకాకముందు జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించారు. వాటిలో 5 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించింది. తెలుగుదేశం 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీతో పొత్తు నేపథ్యంలో ఇప్పుడు జనసేన 24, భాజపా 6 ఆసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తాయా? లేకపోతే జనసేన రెండు స్థానాలు తగ్గించుకుని భాజపాకు 8 అసెంబ్లీ సీట్లు ఇస్తుందా అనే విషయాన్ని ఆ రెండు పార్టీలూ కలిసి నిర్ణయించుకోనున్నట్టు సమాచారం. జనసేన మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా.. బీజేపీతో పొత్తు నేపథ్యంలో మిత్రపక్షం కోసం ఒక లోక్‌సభ సీటు వదులుకునే అవకాశం ఉంది. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు సమాచారం. దీనిపై ఆ రెండు పార్టీలదే తుది నిర్ణయమని తెలుగుదేశం వర్గాలు చెప్పాయి.


జనసేన కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీ చేయాలని మొదట నిర్ణయించుకుంది. ఇప్పుడు కాకినాడ,మచిలీపట్నం స్థానాలకే పరిమితమయ్యే అవకాశముందనిసమాచారం. అనకాపల్లి, అరకు, రాజమహేంద్రవరం, నరసాపురం, ఏలూరు,హిందూపురం, రాజంపేట, తిరుపతిల్లో ఏవో 6 స్థానాల్ని బీజేపీ కోరే అవకాశముంది. తెలుగుదేశంతో కుదిరిన ప్రాథమిక అవగాహన మేరకు పాలకొండ, నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పిఠాపురం....., కాకినాడ గ్రామీణం, అమలాపురం లేదా పి.గన్నవరం, రాజోలు,రాజానగరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నరసాపురం, భీమవరం, పోలవరం, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, తెనాలి, దర్శి, రైల్వే కోడూరు, అనంతపురం, తిరుపతి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన తొలుత నిర్ణయించింది. బీజేపీతో పొత్తు నేపథ్యంలో వాటిలో కొన్నిస్థానాలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

విశాఖ ఉత్తరం, కైకలూరు, ధర్మవరం, జమ్మలమడుగు, శ్రీకాళహస్తి, గుంటూరు పశ్చిమ, తాడేపల్లిగూడెం వంటి సీట్లను భాజపా అడిగే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం 3 అసెంబ్లీ సీట్లు కేటాయించనుంది. ఇప్పటికే నంద్యాల స్థానానికి మాజీ మంత్రి ఫరూక్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మదనపల్లె, గుంటూరు తూర్పు స్థానాలను.. ముస్లింలకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News