టిడిపిలో పదవుల జాతర మొదలు కాబోతోంది. పార్టీ పదవులపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ పదవుల కోసం టిడిపి నేతలు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మహానాడు కార్యక్రమం అయిపోయిన వెంటనే ఎప్పుడైనా పదవుల భర్తీ పూర్తయ్యేది. కానీ ఈసారి కొంచెం ఆలస్యమైంది. దీంతో చాలామంది నేతలు ఆశావహులు సీఎం చంద్రబాబు నాయుడును మంత్రి నారా లోకేష్ ను కలుస్తూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వారానికి ఒకసారి కేంద్ర పార్టీ కార్యాలయానికి వెళ్తూ అక్కడి నేతలను కలుస్తున్నారు. పార్టీ పదవులపై ఆరా తీస్తున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలి.. ఏం పదవులు ఇవ్వాలి అనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే టికెట్లు రానివారు, కార్పొరేషన్ పదవులు రానివారు అందరూ పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం పార్టీ కోసం కష్టపడ్డ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటున్నారు.
గతంలో సీనియర్లకు పదవులు ఇవ్వడం వల్ల వారు యాక్టివ్ గా పని చేయకపోగా కార్యకర్తలను పట్టించుకోలేదు. దాంతో 2019 ఎన్నికల్లో పార్టీకి ఘోరమైన దెబ్బ పడింది. ఈసారి అలా కాకుండా డబ్బున్న వారిని, సీనియర్లను పక్కన పెట్టేసి కేవలం పార్టీ కోసం పని చేసే వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో ఎక్కువగా యువ నాయకులకే ఛాన్సులు ఇవ్వాలని లోకేష్, చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యకర్తలతో ఫీడ్ తెప్పించుకుంటున్నారు. పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ నియోజకవర్గాల పదవుల కోసం ఇప్పటికే చాలానే అప్లికేషన్లు వచ్చాయి. మరి ఎవరికి ఏ స్థానాలు దక్కుతాయో చూడాలి.