TDP : టీడీపీకి కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు : మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీకి కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కనుకనే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు మంత్రి లోకేష్. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకుల వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షును కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా అల్లాబక్షు కుటుంబం పార్టీకి సేవలందిస్తోంది. ప్రస్తుతం మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా అల్లాబక్షు పనిచేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్తమ కార్యకర్తగా నిలిచారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో తన 3.50 ఎకరాల్లో జామాయిల్ తోటను ఆ పార్టీ గూండాలు నరికివేయడంతో పాటు సదరు భూమిని కక్షతో నిషిద్ధ భూముల జాబితా 22-ఏలో చేర్చారు. తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి గోడను కూల్చి భయబ్రాంతులకు గురిచేశారు.