AP: మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు
జేసీపై వ్యాఖ్యలను సమర్థించుకున్న మాధవీలత;
సినీ నటి మాధవీలతపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆవేశంతో మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశానని.. దీనిపై ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికీ లేదని జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
మాధవీలత ఆగ్రహం
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై సినీనటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. ఈ మేరకు మాధవీలత వీడియో విడుదల చేశారు. తానేమీ తప్పు మాట్లాడలేదన్న మాధవీలత.. రాజ్యాంగబద్ధంగా, మహిళల రక్షణ కోసం మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడేది లేదని.. కేసులు పెట్టినా.. చంపినా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.
మాధవీలతపై ఫిర్యాదు
పీ రాజకీయాల్లో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తాడిపత్రిలోని జేసీ పార్కులో నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే జేసీ బస్సులను దగ్ధమవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాధవీలతపై తాడిపత్రిలో పోలీసు స్టేషన్‌లో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.